Tulasi pooja in Telugu

 🌷తులసి పూజ ఎలా చేయాలి?🌷


తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.


ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.


నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!

నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!

బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!

పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!


ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం

యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్


అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.


యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః

యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం


అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.


"తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే

నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే"


అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.


👉పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.


తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.


తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.


🌷తులసి దళాలను ఎలా త్రెంపాలి?


తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.


👉తులసి మొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.


"మాతస్తులసి గోవింద హృదయానందకారిణి

నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే


తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా

చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే


త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం

తథా కురు కురు పవిత్రాంగి! కలౌ మలవినాశిని!"


👉శ్రీహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.


👉పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.


🌷శ్రీ మాత్రే నమః🌷

Comments

Popular posts from this blog

Lyrics in Telugu naa cheli rojave song, na cheli rojave song lyrics in Telugu

Telugu story