Vivekanandha story
గురుకులానికి సెలవలు వచ్చాయి. ‘‘వారం రోజులు అంతా ఇళ్లకు వెళ్లి రండి’’ అన్నారు గురువు. ‘‘వచ్చేటప్పుడు తలా రెండు గుప్పెళ్ల బియ్యం మూట కట్టుకు రండి’’ అని కూడా చెప్పారు. శిష్యులు తలలు ఊపారు.‘‘అయితే చిన్న షరతు. ఇంట్లో వాళ్ల కంట పడకుండా మీరు ఆ బియ్యాన్ని తీసుకురావాలి’’ అన్నారు గురువు. వారం గడిచింది. శిష్యులందరూ తిరిగి గురుకులానికి చేరుకున్నారు. అందరూ బియ్యం తీసుకొచ్చారు.
వారిలో ఒక్కరు మాత్రం వట్టి చేతులతో వచ్చారు! ‘‘నువ్వు తేలేకపోయావేం?’’ అని ఆ శిష్యుడిని అడిగారు గురువు. ‘‘ఎవరూ చూడకుండా తేలేకపోయాను గురువర్యా’’ అన్నాడు శిష్యుడు. గురువు భృకుటి ముడివేశారు. ‘‘ఎవరి కంట్లోనూ పడకుండా బియ్యం డబ్బా దగ్గరికి వెళ్లేవాడిని. అయితే వెళ్లిన ప్రతిసారీ ఒకరు నన్ను చూసేవారు’’ అని చెప్పాడు శిష్యుడు. ‘‘ఎవరు ఆ ఒక్కరు’’.. అడిగారు గురువు. ‘‘నేనే గురువర్యా.. నా కంట్లో నేనే పడేవాడిని.
అందుకే ఎవరూ చూడకుండా బియ్యం తేవడం సాధ్యం కాలేదు’’ అని చెప్పాడు ఆ శిష్యుడు. ఆ మాటకు గురువు.. మిగతా శిష్యుల వైపు చూశారు. ఎవరూ చూడకుండా తప్పు చేసినా, మన నుంచి మనం తప్పించుకోలేం అని చెప్పడానికే గురువుగారు బియ్యం దొంగిలించుకు రమ్మన్నారని శిష్యులకు అర్థమైంది. ఆ గురువు రామకృష్ణ పరమహంస. ఆ శిష్యుడు స్వామీ వివేకానంద
Comments
Post a Comment